తెలంగాణ గడ్డపై మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ‘ఖేలో ఇండియా’ పోటీలను దేశమే ఆశ్చర్యపోయేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని గట్టిగానే హెచ్చరించారు. అసలు ఈ పోటీల నిర్వహణ కోసం సీఎం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం..
డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అలాగే 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను అంతే గ్రాండ్‌గా ప్లాన్ చేయాలన్నారు. పోటీలు జరిగే రోజుల్లో హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఉండాలన్నారు. ఇందుకోసం పోలీస్, మున్సిపల్ విభాగాలు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
పనులన్నీ పక్కాగా జరగడానికి ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని బాధ్యులుగా చేయడంతో పాటు, జిల్లాలవారీగా మంత్రులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను చూసుకోనున్నారు. ఇక మహబూబ్‌నగర్ బాధ్యతలను జూపల్లి కృష్ణారావుకు, వరంగల్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, కరీంనగర్‌ను అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించారు. అలాగే ఖమ్మం బాధ్యతలను తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పర్యవేక్షణను సుదర్శన్ రెడ్డి చూసుకోవాలని సీఎం సూచించారు.
దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, అతిథులకు అందించే ఆహారం, వసతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. స్టేడియంల పునరుద్ధరణ పనుల్లో క్వాలిటీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్‌లను నియమించి, మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించాలని దిశానిర్దేశం చేశారు.