3 జోన్లుగా తెలంగాణ విభజన..! సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దేశ, విదేశీ అతిథులకు ఆయన ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తాము అనుసరిస్తున్న ప్రణాళికలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఆయన సమక్షంలో మోదీ ప్రభుత్వానికి రేవంత్ కీలక విజ్ఞప్తి సైతం చేశారు.

రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణను మూడు ప్రధాన జోన్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అభివృద్ధి మంత్రాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి పరిధిని ‘క్యూర్’ జోన్‌గా పరిగణించి.. ఇక్కడ సేవా రంగాలకు (సర్వీస్ సెక్టార్) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న ప్రాంతంలో తయారీ రంగాన్ని (మ్యానుఫ్యాక్చరింగ్) ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాల్లో (రేర్) వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో కేవలం రహదారుల నిర్మాణమే కాకుండా ఇతర కీలక మౌలిక వసతుల కల్పనకు కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా వేగంగా చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా నూతన ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ (TIMS) తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి ఏకంగా 8,000 పడకలను (బెడ్స్) అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని.. దేశ భద్రత, జాతి ప్రయోజనాలు, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు ఎటువంటి తావు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కీలక పనుల గురించి తమ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే వివరించారని, ఆ ప్రాజెక్టులకు కేంద్రం, సంబంధిత విభాగాలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. దేశాభివృద్ధిలో, పెట్టుబడుల సాధనలో ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరై తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులందరినీ ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.