బీఆర్​ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ..!

బీఆర్​ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాయిస్​ శాంపిల్​ ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసును సవాల్​ చేస్తూ కౌశిక్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. గత జనవరిలో సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ జిల్లా వీణవంక వద్ద పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అనంతరం హుజూరాబాద్​‌కు తరలించారు. దాంతో పోలీసుల తీరుకు నిరసనగా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్​‌​లో రోడ్డుపై బైఠాయించారు. కరీంనగర్ కమిషనర్​ గౌస్​ ఆలంను దూషించటంతోపాటు పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై వీణవంకతో పాటు హుజూరాబాద్ పోలీస్​ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులను పోలీసు అధికారులు సీఐడీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు వాయిస్ శాంపిల్స్ ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కరీంనగర్ కోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ నిర్వహించిన కరీంనగర్ కోర్టు వాయిస్ శాంపిల్స్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షల కారణంగా నమోదైన కేసులో భాగంగా సీఐడీ అధికారులు వేధిస్తున్నారని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, సీపీ దూషించిన క్రమంలో సీఐడీ అధికారులు దర్యాప్తులో భాగంగా చట్ట ప్రకారం వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టులో వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా కరీంనగర్ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి తన వాయిస్ శాంపిల్స్​ ను సీఐడీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.