తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష..

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని సెక్షన్‌ 22-ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. 60 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

అయితే గడువు ముగిసినా కలెక్టర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బాధితులు 2025 అక్టోబరు 15న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాతే అధికారులు స్పందించారు. బాధితులకు నోటీసులు జారీ చేసి, 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించారు. అనంతరం జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు ఇచ్చారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన తర్వాతే అధికారులు స్పందించడం, కోర్టు ఆదేశించిన గడువులోగా నిర్ణయం తీసుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్‌ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని నిర్ధారించింది. ఐఏఎస్‌ స్థాయి అధికారి న్యాయస్థానం ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించింది.