జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం..! హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి..?

జహీరాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక వ్యవహారం హాట్ గా మారింది. కో-ఆప్షన్ ఎన్నికలను నిబంధనల ప్రకారం సకాలంలో నిర్వహించకపోవడంపై 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టి మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిందని కౌన్సిలర్ స్రవంతి తెలిపారు.

ఈ వ్యవహారం విచారణకు వచ్చినప్పుడు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మున్సిపాలిటీ చట్టం, 2019 మరియు దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం కో-ఆప్షన్ ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని, కానీ ఆయన ఆ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు, చట్టప్రకారం ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలుపాలని, నిబంధనలను ఎందుకు పాటించలేదో కారణాలు తెలపాలని అధికారులకు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు.

మున్సిపల్ తరపున స్టాండింగ్ కౌన్సెల్ కోర్టు ఎదుట స్పందిస్తూ.. చట్టం మరియు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని, ఈవిషయంపై కమిషనర్ నుండి తదుపరి సూచనలు, వివరాలు తీసుకునేందుకు కోర్టును మరింత సమయం కోరారన్నారు. ఈ వ్యవహారంపై న్యాయవ్యవస్థ మీద తమకు అపారమైన నమ్మకం ఉందని, హైకోర్టులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని పిటిషనర్ స్రవంతి ఆశాభావం వ్యక్తం చేశారు.