ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్..!

సింగరేణి కాలరీస్‌ సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, కొత్త గనులను అభివృద్ధి చేయడంతోపాటు కీలక ఖనిజాల అన్వేషణలోకి విస్తరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

‎హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సింగరేణి కాలరీస్‌కు చెందిన 66 మంది జనరల్‌ మేనేజర్లతో నిర్వహించిన ప్రత్యక్ష ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడార. సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల అభివృద్ధి, భవిష్యత్తు విస్తరణ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థ సాధించిన ప్రగతిని అధికారులు వివరించగా, జనరల్‌ మేనేజర్ల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయి పనితీరుపై భట్టి విక్రమార్క ఆరా తీశారు.

పదేళ్లపాటు సింగరేణి విస్తరణను పట్టించుకోకుండా, కొత్త బొగ్గు బ్లాకులు అందకుండా చేసిసంస్థను నిర్వీర్యం చేయాలని చూసినవారే.. ఇప్పుడు సింగరేణికి నష్టం జరుగుతోందంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని  వ్యాఖ్యానించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గుతోందని, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, సంస్థకు భవిష్యత్తు లేదని ప్రచారం చేస్తున్నవారు గతంలో ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సంస్థను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకున్నవారే ఇప్పుడు విమర్శలకు దిగడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. సింగరేణిని కాపాడేందుకు తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, కొత్త గనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
‎

‎గత పదేళ్లలో సంస్థ అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోలేదని, విస్తరణకు బదులుగా సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 34 వేల నుంచి 36 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆధారపడిన సింగరేణిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు గతంలో తీసుకోకపోవడం వల్లే సంస్థ కీలక దశకు చేరుకుందని భట్టి విక్రమార్క అన్నారు. సంస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో విస్తరణకు ఆటంకాలు ఏర్పడ్డాయని విమర్శించారు. సింగరేణి భవిష్యత్తుపై జనరల్‌ మేనేజర్లు, కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. అందరూ సంస్థ మనుగడ కోసం కొత్తగా ఆలోచించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారని చెప్పారు. గతంలో కేటాయించిన బొగ్గు బ్లాకులను కూడా మళ్లీ వేలం ప్రక్రియలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించామని, ఇప్పటికే కేటాయించిన బ్లాకులను సింగరేణి వినియోగించుకునేలా తన వాదనను వివరించానని చెప్పారు. తెలంగాణ, సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని పేర్కొన్నారు.

‎‎సింగరేణి బొగ్గు సరఫరా చేయలేకపోతోందంటూ విమర్శలు చేయడం సరికాదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేటప్పుడే వాటికి అవసరమైన బొగ్గు కేటాయింపులను పక్కాగా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అవసరమైన బొగ్గు కేటాయింపులు లేకుండానే విద్యుత్‌ ప్రాజెక్టులకు సరఫరా బాధ్యతలను సింగరేణిపై పెట్టడం వల్ల సమస్యలు తలెత్తాయని వివరించారు. గతంలో విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి వద్ద అందుబాటులో ఉన్న బొగ్గు నాణ్యతను బట్టి సరఫరా చేయాల్సి ఉంటుందని, గనుల్లో లభించే బొగ్గు గ్రేడ్‌ను మార్చి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనే బొగ్గు కేటాయింపులు, సరఫరా ఏర్పాట్లు చేసుకుని ఉంటే ప్రస్తుత సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు.
‎

‎‎సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటే మార్కెట్‌లో ఇతర సరఫరాదారులతో పోటీ పడటం కష్టమవుతుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తక్కువ ధరకు బొగ్గు లభించే చోట వినియోగదారులు కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సింగరేణి ధరలు పోటీకి అనుగుణంగా లేకపోతే సంస్థ మార్కెట్‌ను కోల్పోవడమే కాకుండా, ఉద్యోగుల భవిష్యత్తుపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, సిబ్బంది, యంత్రాలను సమర్థంగా వినియోగించుకోవడం, పని విధానాలను మెరుగుపరచడం ద్వారా ఉత్పాదకత పెంచాలని సూచించారు. సంస్థ లాభాల్లోకి వస్తేనే ప్రస్తుత కార్మికులతోపాటు భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించగలమన్నారు. సంస్థను పోటీ మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.
‎

‎‎భవిష్యత్తులో బొగ్గుపై మాత్రమే ఆధారపడకుండా సింగరేణి తన కార్యకలాపాలను ఇతర ఖనిజాల రంగంలోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. సౌర విద్యుత్‌, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పంప్డ్‌ స్టోరేజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌, బొగ్గు డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశాలను ముందుగానే అంచనా వేయాలన్నారు. సింగరేణికి శతాబ్దానికి పైబడిన గనుల తవ్వకం అనుభవం ఉందని, దాన్ని ఉపయోగించుకొని రాగి, బంగారం, వెనేడియం, లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లోకి ప్రవేశించాలని సూచించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకొని, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాత కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పారు.

కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి..

‎సింగరేణి జనరల్‌ మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కారాలను ప్రభుత్వానికి సూచించాలని భట్టి విక్రమార్క అన్నారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన కొత్త ఆలోచనలను ముందుకు తీసుకురావాలని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మెరుగైన ఫలితాల సాధనకు వినియోగించుకోవాలని సూచించారు. అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సింగరేణిని లాభదాయక సంస్థగా తీర్చిదిద్ది, కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.