భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మహారాష్ట్రలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో క్లెయిమ్ లు, అభ్యంతరాల దాఖలుకు తుది గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మహారాష్ట్రలో జరుపుతున్న ఎస్ఐఆర్ లో దాదాపు 33శాతం మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారంటూ అరుణ్ ఆనందగిరి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ.మోమనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ అరవింద్ దాతార వాదనలు వినిపించారు. ముంబై, పూణె నగరాల్లో దాదాపు మూడున్నర వేల పునరాభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నట్టు తెలిపారు. పాత కాలనీల కూల్చివేతల వల్ల వేలాదిమంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయినట్టు చెప్పారు. చిరునామాల వివరాలు సరిపోవటం లేదన్న కారణంపై వారి పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించే ప్రమాదం ఉందన్నారు. నేటితో ముగియనున్న క్లెయిమ్ లు, అభ్యంతరాల గడువును పొడిగించాలని కోరారు. ఈ మేరకు తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. కాగా, ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.