ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ..! ఇలా దోపిడీ చేయడం ఏంటి..?: అనిల్ కుమార్ యాదవ్..

ప్రజల మద్దతు ఉంటే ప్రజాక్షేత్రంలో నేరుగా పోటీ చేసి గెలవాలి తప్ప, ఇలాంటి దోపిడీ రాజకీయాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతిపక్ష నాయకులను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, ధైర్యంగా ముందుకు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీ వ్యాపారంగా మార్చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ స్థానాలకు ఏకంగా స్లాబ్ రేట్లు నిర్ణయించి, విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఏ మార్గంలోనైనా సరే గెలిచినట్లు చూపించుకోవడానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ తరహా దోపిడీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.