‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ..! జగన్ సంచలన వ్యాఖ్యలు..!

స్థానిక ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), గవర్నర్ కు సమర్పించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నామినేషన్స్ లో చోటుచేసుకుంటున్న అరాచకాలను సుప్రీంకోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు జగన్ తెలిపారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మెుట్టికాయాలు వేసిందని ఎద్దేవా చేశారు. తమ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి.. ఈ నెల 25 కి అభ్యర్థుల తుది జాబితాను వాయిదా వేయాలని సూచించిందన్నారు. స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎన్నికల నామినేషన్లు ఇలా రాష్ట్రంలో అడ్డుకోవడం చూస్తుంటే వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో స్పష్టమవుతోందని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం చెబుతున్నట్లుగా పారదర్శకంగానే ఎన్నికలు నిర్వహిస్తుంటే.. నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేశారన్న నమ్మకం ఉంటే నామినేషన్లను అడ్డుకోవద్దని సవాల్ విసిరారు. మరోవైపు సీఎం చంద్రబాబు చేతిలో రాష్ట్ర డీజీపీ తోలు బొమ్మలా మారారని జగన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో కూడా డీజీపీ సహా డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో మార్పు రాలేదన్నారు. కోర్టు తీర్పు అనంతరం కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు, ఎస్ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రంలోని మెుత్తం 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నాలుగు చోట్ల మాత్రమే రీనామినేషన్ కు ఛాన్స్ ఇచ్చారన్నారు. మైదకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు, రాజంపేటలో 11 వార్డులకు మాత్రమే రీనామినేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారని జగన్ ఆరోపించారు. కడపలో 66 వార్లుడు ఉంటే.. 11 చోట్ల మాత్రమే రీనామినేషన్ కు ఛాన్స్ ఇచ్చారన్నారు. అటు రాజంపేట మున్సిపాలిటీలోనూ 32 వార్డులు ఉంటే 11 వార్డుల్లో రీనామినేషన్ కు అనుమతి ఇచ్చినట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఎస్ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తోందా? లేక సీఎం చంద్రబాబు ఆదేశాలను అవలంభిస్తోందా? బహిరంగంగా చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. చిత్తూరు, నగరి, చిలకలూరిపేట, నెల్లూరులో స్క్రూటినీ పేరుతో నామినేషన్లు రద్దు చేశారన్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిని ఏమనాలి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రబాబును శకునితో పోలుస్తూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘మహాభారతంలో శకునికి పాచికలు ఉండేవి. ఏ నెంబర్‌ కావాలంటే.. ఆ నెంబర్‌ పడేలా గేమ్‌ సెట్‌ చేసేవారు. ఈ వ్యవస్థలో చంద్రబాబే శకుని. చంద్రబాబు రూల్స్‌ సెట్‌ చేస్తున్నారు. మూడేళ్లు కావొస్తుంది.. మీ పనితీరు చూపించి ఓట్లు అడగాలి. వీళ్ల సూపర్‌ సిక్స్‌ లేవు.. సూపర్‌ సెవెన్‌ లేవు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రజలంతా చంద్రబాబును నిలదీసే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా వీళ్లలో మార్పు రాలేదు’ అని జగన్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.