ఏపీ సీఎం చంద్రబాబుతో వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే నామినేషన్ల దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుండగా.. కొన్ని చోట్ల కూటమి అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తెదేపా, జనసేన, భాజపా నుంచి ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తుండటంతో ఈ ఉద్రిక్తతకు తెరదించేలా సీఎం నివాసంలో వీరిద్దరూ సుమారు అరగంట పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
నిన్న కూడా ఇదే అంశంపై ఇరువురు నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. నేటితో గడువు ముగుస్తుండటంతో వివాదాస్పద స్థానాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టత తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కూటమి అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత లేకపోవడంతో గెలిచే అవకాశాలున్న స్థానాల్లో మూడు పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థిని ఖరారు చేయడం, ఆశావాహులను సముదాయించడం, ఏకాభిప్రాయం సాధించడంపై వరుస భేటిల్లో ఇరువురు నేతలు లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే జడ్పీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లోనూ జనసేనకు 30 శాతం స్థానాలు కావాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 9,829 ఎంపీటీసీ, 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. వాటిలో జనసేన 30 శాతం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జడ్పీ ఛైర్మన్, మండల పరిషత్ ల అధ్యక్ష పదవులు సైతం అదే దామాషాలో కావాలని పవన్ కోరినట్లు టాక్. అయితే ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా? పవన్ తన డిమాండ్స్ ను సాధించడంలో సక్సెస్ అవుతారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.