ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి..!

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దేశ రాజధాని దిల్లీలో విపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కూటమి నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు వరకూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘చలో ఢిల్లీ – ప్రజాస్వామ్య పరిరక్షణ మార్చ్’తో దేశ రాజధానిని హోరెత్తించారు.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, మండి హౌస్ మధ్య ఉన్న ప్రధాన రహదారులన్నీ నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. బరాఖంబా రోడ్ జంక్షన్ వద్ద ప్రతిపక్ష నేతలందరూ ఏకమై సుప్రీంకోర్టు వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు. ఈ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు జాతీయ రాజధాని వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నాయకత్వం మారే వరకు, రాజ్యాంగం పరిరక్షించబడి ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇండీ కూటమి నేతల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆరు కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది. నిరసనలు జరిగే మార్గంలో ఉన్న జన్ పథ్, మండి హౌస్, బారాఖంబా రోడ్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.