సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి పేషీ ఫ్లోర్ వద్ద ఆంక్షల పహారా పరాకాష్టకు చేరిందనే విమర్శలు ఊపందుకున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం, జీవిత కాలమంతా సేవ చేసిన రిటైర్ అయిన ఉద్యోగులు తమ హక్కుల కోసం వస్తుంటే.. పోలీసులు, గన్ మెన్ల అడ్డుగోడలు దర్శనమిస్తున్నాయి. సమస్య చెప్పుకోవడానికి వచ్చే బాధితులను కలవకుండా పోలీసులతో అడ్డుకోవడంపై సచివాలయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పాలనా విభాగానికి గుండెకాయ లాంటి సచివాలయం ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలా కాకుండా, ఆంక్షల రక్షణ వలయంలో బంధీ అయిన కోటలా కనిపిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పేషీ ఉన్న ఫ్లోర్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న వాతావరణం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా సమస్యలను వినడానికి, తమ న్యాయమైన హక్కుల కోసం సచివాలయానికి వస్తున్న సాధారణ ప్రజలు, చిన్న కాంట్రాక్టర్లు, దశాబ్దాల పాటు సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులను పోలీసు బందోబస్తుతో అడ్డుకోవడం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు మూడంచెల భద్రత, పోలీసుల పహారా ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని సచివాలయ వర్గాలే ముక్కున వేలేసు కుంటున్నాయి. ప్రజల ప్రతినిధులుగా గెలిచి, ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నాయకులు తమ వద్దకు వచ్చే బాధితులను కలవడానికి ఎందుకు భయపడుతున్నారు? ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సచివాలయ ప్రాంగణంలో మార్మోగుతున్నాయి. ఇదే అంశంపై తాజాగా సోమవారం కూడా కొంత మంది బాధితులు సచివాలయంలోని సెకండ్ ప్లోర్ లో కొద్ది సేపు ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.
రాష్ట్రంలో చిన్న తరహా కాంట్రాక్టర్లు, సేవాలందించిన రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉపాధి పొందేందుకు, తమ సొంత నిధులను వెచ్చించి పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు మంజూరు కావడం లేదు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్ల రూపాయల బిల్లులు వెంట వెంటనే క్లియర్ అవుతుండగా, చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ఆర్థిక శాఖ మొండిచేయి చూపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పైగా పెండింగ్ బిల్లుల విడుదలకు 20 నుండి 30 శాతం వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కమిషన్లు ఇస్తే తప్ప ఫైళ్లు కదలడం లేదని బాధితులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం తమ సర్వీసు లో దాచుకున్న సొమ్మును పొందేందుకు సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. “30 ఏళ్లకు పైగా ప్రభుత్వానికి, సమాజానికి సేవలందించిన మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సర్వీసులో దాచుకున్న సొంత డబ్బుల కోసం కూడా భిక్షగాళ్లలా వేడుకోవాలా?” అని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
కమ్యూనికేషన్ గ్యాప్.. పెరిగిన ‘లొల్లి’..
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు , అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ కూడా లోపించడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది వినతిపత్రాలు ఇవ్వడానికి వస్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదు. పేషీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. ఇది చివరకు ఆర్థిక శాఖ ఫ్లోర్ వద్ద ప్రతినిత్యం ధర్నాలు, లొల్లులు, ఉద్రిక్తతలకు దారితీస్తోంది.దీంతో ఆయా బాధితులు తమ ఆవేదనను వ్యక్త పరుస్తూ సీరియస్ అవుతున్నారు. ఎన్నికల ముందు “ఆరు గ్యారెంటీలు”, “420 హామీలు” ఇస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బాధితులకు కనీసం దర్శనం కూడా ఇవ్వకపోవడమేనా “ప్రజా పాలన” అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.