తిరుపతి వేదికగా అఖిల భారత డీజీపీల సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా..

ప్రతిష్ఠాత్మక 61వ అఖిల భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల సదస్సుకు తిరుపతి జిల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. జాతీయ భద్రత, పోలీసు వ్యవస్థ పనితీరు వంటి కీలక అంశాలపై చర్చించే ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి జిల్లాలోని ఏర్పేడు సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) ప్రాంగణం ఈ సదస్సుకు వేదిక కానుంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొంటారు.

ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు పాల్గొని దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ఐపీఎస్ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. జాతీయ స్థాయిలో ఇంతటి కీలకమైన సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.