రైతులకు డిజిటల్ వ్యవసాయ సేవలపై అవగాహన

తానూర్ మండలం ఝరి బి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు డిజిటల్ క్రాప్ సర్వే, క్రాప్ బుకింగ్, ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి అంబాదాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన డిజిటల్ వ్యవసాయ సేవలపై రైతులకు వివరించారు.

రైతులు తమ పంటల సాగు వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అంబాదాస్ సూచించారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, పంట సంబంధిత సేవలు, ఇతర ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని తెలిపారు.

క్రాప్ బుకింగ్ విధానం, పంటల వివరాల నమోదు, ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల లభ్యతను తెలుసుకునే విధానంపై రైతులకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వ్యవసాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.