రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కార్యకర్తలే పార్టీకి బలం.. మీ ఫీడ్‌బ్యాక్‌కు విలువ
“ఈ రోజు మేము మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీ ముందు నిలబడ్డామంటే దానికి కారణం కార్యకర్తల త్యాగాలు, శ్రమే. ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులను ఎదుర్కొని కూడా పసుపు జెండాను దించకుండా పోరాడిన మీరే పార్టీకి అసలైన బలం. అందుకే టీడీపీలో కార్యకర్తే అధినేత” అని లోకేశ్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో ఏ పార్టీ చేయని విధంగా బీమా సౌకర్యం కల్పించి, ఇప్పటివరకు రూ.160 కోట్లు ఖర్చు చేశామన్నారు.
యువగళం పాదయాత్రలో కార్యకర్తలు కోరినట్లే, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ‘మైటీడీపీ’ యాప్‌ను తీసుకొచ్చామని తెలిపారు. “మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమం, మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ నేరుగా మాకు చేరుతుంది. కొత్త పెన్షన్లు, ఇళ్ల మంజూరు వంటివి కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నాం. కష్టపడే కార్యకర్తను మేమే వెతుక్కుంటూ వస్తాం. ఎక్కడైనా సమస్య పరిష్కారం కాకపోతే, మీకు అండగా నేనుంటాను” అని హామీ ఇచ్చారు.
అనంతపురం అభివృద్ధి నా బాధ్యత
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అని, తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆదరించిందని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. “ఎన్టీఆర్‌ను, హరిమామను, మా బాల మావయ్యను గెలిపించిన గడ్డ ఇది. ఈ అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. అనంతపురం జిల్లా అభివృద్ధి నా బాధ్యత” అని స్పష్టం చేశారు. సోలార్, విండ్ ఎనర్జీ, ఫైటర్ జెట్ తయారీ సంస్థ వంటి పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఉరవకొండలో తయారయ్యే విండ్‌మిల్‌పై ‘మేడ్ ఇన్ ఉరవకొండ’ అని మంత్రి కేశవ్ సంకల్పం పెట్టుకున్నారని, ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధికి పోటీ పడాలని సూచించారు. ఈ సందర్భంగా, కనేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గొడ్డలి పార్టీవి డ్రామాలే.. అసెంబ్లీకి రా జగన్!
వైసీపీపై లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “గొడ్డలి పార్టీతో మనం రాజకీయంగా పోరాడుతున్నాం. సొంత బాబాయ్‌ని హత్య చేసి, ఆ నిందను ఇతరులపై వేయడం వారి నైజం. కోడికత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో వారి మాజీ మంత్రిని ఈడీ అరెస్ట్ చేస్తే, దానికి కూడా మమ్మల్ని నిందిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. “డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని జగన్, డీఎస్సీపై చర్చకు సిద్ధమా? టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చెయ్. ప్రెస్‌మీట్లు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించింది వారి సమస్యలు సభలో ప్రస్తావించడానికే. కానీ రెండేళ్లలో ఒక్కసారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్లిపోయావు. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా” అని లోకేశ్ సవాలు చేశారు.
కూటమి ఐక్యతను కాపాడాలి
కూటమిలో చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు. “జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. వాటిని నమ్మి ఆవేశపడొద్దు. మనమంతా ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుంది” అని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని, ఇప్పటికే 16 వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.