ఇండోనేషియా: తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:58 గంటలకు భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది.
భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు దెబ్బతినడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు దెబ్బతిన్నాయి. భారీ ప్రకంపనల నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసి, ప్రజలను సముద్ర తీరాలకు దూరంగా వెళ్లి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అనంతరం సునామీ హెచ్చరికను ఎత్తివేశారు.
భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం నమోదైంది. వందలాది ఇళ్లు, పాఠశాలలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. సుమారు 2,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, వరుసగా ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.