‘వందేమాతరం’ సమయంలో సోనియా, ఖర్గే సైగలు.. కాంగ్రెస్‌ వేడుకల్లో కొత్త వివాదం

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాలాపన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన హావభావాలు, సైగలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

వైరల్‌గా మారిన వీడియోను ఆధారంగా చేసుకుని బీజేపీ నేతలు.. ‘వందేమాతరం’ పూర్తి రూపంలో ఆలపించడాన్ని కాంగ్రెస్‌ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని కోరలేదని, చాలాసేపు నిల్చున్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీని అడుగుతూ ఆమె సైగ చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వివరణ ఇచ్చారు.

అయితే ‘వందేమాతరం’ పూర్తి రూపంలో ఆలపించడంపై కాంగ్రెస్‌లో గతంలోనూ చర్చలు జరిగినట్లు జైరాం రమేశ్‌ తెలిపారు. ఏఐసీసీ కార్యక్రమంలో ఈసారి పూర్తి గీతాన్ని ఆలపించారని, దీనిపై వివాదం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో బీజేపీ ఆరోపణలు, కాంగ్రెస్‌ వివరణల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.