Sonam Wangchuk: నిజాయతీ గల నాయకులను గుర్తించడంలో సాయం చేయండి.. దేశ ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు

భారతదేశాన్ని అర్థవంతమైన మార్పు దిశగా నడిపించగల నిజాయతీ, నిబద్ధత కలిగిన నాయకులను గుర్తించడంలో తనకు సహాయం చేయాలని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ దేశ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘X’లో భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

దేశానికి సరైన రాజకీయ నాయకత్వం ఎంతో అవసరమని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. సమాజం, దేశ భవిష్యత్తును సరైన దిశలో నడిపించేందుకు నిజాయతీగా పనిచేసే నాయకులను గుర్తించడం ప్రతి పౌరుడి బాధ్యతగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.

సరైన రాజకీయ నాయకత్వం లేకపోతే సమాజం, దేశ భవిష్యత్తు తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న నిజాయతీ, నిబద్ధత కలిగిన నాయకులను గుర్తించి ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.