ఆర్థిక స్వాతంత్య్రం అంటే కేవలం ఆదాయం పెరగడం మాత్రమే కాదని.. అవసరమైన చోటుకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా స్వేచ్ఛగా వెళ్లగలగడం కూడా అందులో భాగమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రయాణ ఖర్చుల కారణంగా బయటకు వెళ్లేందుకు వెనకడుగు వేసే పరిస్థితులను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల దైనందిన జీవితంలో కీలక మార్పుకు కారణమవుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం అందుతోంది. ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రయాణ ఖర్చు తగ్గడంతో మహిళలు మరింత స్వేచ్ఛగా తమ అవసరాల కోసం బయటకు వెళ్లే అవకాశం ఏర్పడింది.
ఏడాది కాలంలో ‘స్త్రీ శక్తి’ పథకం కోట్లాది మహిళల ప్రయాణానికి అండగా నిలిచిందని ప్రభుత్వం చెబుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు వారి సామాజిక, వ్యక్తిగత స్వేచ్ఛను పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే ప్రజా రవాణాను అందించడం ద్వారా వారి సాధికారతకు మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.