నల్గొండ: భరోసా కేంద్రం సేవలపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ

మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక వేధింపులు, హింసకు గురైనప్పుడు వారికి సత్వర న్యాయం, సమగ్ర సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం నల్గొండలోని భరోసా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ కౌన్సెలింగ్ గదులను పరిశీలించడంతో పాటు కేసుల నిర్వహణ, రికార్డులను తనిఖీ చేశారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయం, కౌన్సెలింగ్ విధానం, కేసుల పురోగతిపై ఆరా తీశారు.

బాధిత మహిళలు, బాలికలు, చిన్నారులకు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. బాధితుల గోప్యతను కాపాడుతూ వారికి అవసరమైన న్యాయ, వైద్య, మానసిక సహాయాన్ని సమన్వయంతో అందించాలని అధికారులను ఆదేశించారు.