పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సామాజికంగా అవమానకరమైన చర్యగా పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘దళిత బహుజనులు అంటే బీజేపీ పార్టీకి ఇష్టం లేదా?’’ అని ప్రశ్నించారు. ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై బాధ్యులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.