రాజాం: మెగా డీఎస్సీ అవకతవకలపై వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసులతో వాగ్వాదం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపు వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వైసీపీ నాయకులు పొనుగుటివలస జంక్షన్‌లో మానవహారం చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని తలే రాజేష్ డిమాండ్ చేశారు. వైసీపీ ఇప్పటికే డీఎస్సీ విషయంలో చేసిన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగులు, అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.