రష్యా, చైనా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా తన అణు విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. కోల్డ్ వార్ అనంతరం అత్యంత ప్రాధాన్యమైన వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్న ఈ నిర్ణయంలో భాగంగా, పరిమిత స్థాయిలో ఉపయోగించే టాక్టికల్ అణ్వాయుధాలపై ప్రత్యేక దృష్టి సారించేలా పెంటగాన్ కొత్త అణు వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ప్రాంతీయ ఘర్షణలు లేదా యుద్ధక్షేత్రాల్లో ఉపయోగించే చిన్నతరహా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచడం, మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా అమెరికా రక్షణ విధానాన్ని బలోపేతం చేయడమే ఈ సమీక్ష ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అమెరికా తన అణు నిరోధక సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని భావిస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త వ్యూహం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాధికారాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలపై కూడా సమీక్ష జరుగుతున్నట్లు తెలుస్తోంది. రష్యా, చైనా వ్యూహాత్మక పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు ప్రపంచ భద్రతా పరిస్థితులపై కీలక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.