జాకినాలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సర్పంచ్ కదిరే శేఖర్ యాదవ్

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జాకినాలపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్ కదిరే శేఖర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలోని 6వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కదిరే శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు అండర్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా చూడటంతో పాటు దోమల బెడద, దుర్వాసన వంటి సమస్యలను నివారించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలే రాజశేఖర్, వార్డు సభ్యులు జహంగీర్ బాబా, మహిపాల్, వెంకటేష్, శారదమ్మ, మాధవి, గ్రామ పెద్దలు, యువకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.