వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గురువారం హనుమకొండ కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ట్రేడ్ లైసెన్సుల వసూళ్లు, బయోమెట్రిక్ హాజరు, ప్లాస్టిక్ నియంత్రణ, వర్షాకాల సన్నద్ధత తదితర అంశాలపై డివిజన్ల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్షాల కారణంగా ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఘన వ్యర్థాల సకాలంలో సేకరణ, డ్రైనేజీ నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించేలా కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.