బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు చేసుకునే అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు గడువులోగా పూర్తి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే టీఆర్ఎస్ పేరును పోలి ఉండని ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను కూడా ఎన్నికల సంఘానికి సూచించాలని స్పష్టం చేసింది.
జూన్ 23న ఎన్నికల సంఘం జారీ చేసిన లేఖలో ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుపై అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంటూ ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరింది. దీనిని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల సంఘం విధుల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని పేర్కొన్న కోర్టు, ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమగ్ర వివరణ ఇవ్వాలని సూచించింది.
విచారణ సందర్భంగా ‘తెలంగాణ రక్షణ సమితి’, ‘తెలంగాణ రక్షణ సేన’ పేర్లు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరుతో పోలి ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు కవిత తరఫు న్యాయవాదులు పార్టీ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఎన్నికల సంఘం ఇవ్వలేదని వాదించారు. ఎన్నికల సంఘం మాత్రం అన్ని నిబంధనల ప్రకారమే వ్యవహరించామని కోర్టుకు వివరించింది. వాదనలు ముగిసిన అనంతరం ఈసీ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు కవితకు సూచించింది.