టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం చోటుచేసుకుంది. టెక్ దిగ్గజం మెటా మన మెదడులోని ఆలోచనలను నేరుగా చదివి, వాటిని అక్షర రూపంలోకి మార్చే ఒక విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను ఆవిష్కరించింది. ‘బ్రెయిన్2క్వెర్టీ v2’ (Brain2Qwerty v2) పేరుతో పిలుస్తున్న ఈ టెక్నాలజీకి ఎలాంటి సర్జరీ లేదా ఇంప్లాంట్లు అవసరం లేకపోవడం అతిపెద్ద విశేషం. పక్షవాతం, మెదడుకు గాయాలు, ఇతర కారణాల వల్ల మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. కేవలం ఆలోచనల ద్వారానే వారు ఇతరులతో సంభాషించే అవకాశం కలుగుతుంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ టెక్నాలజీ కోసం మెటా ఒక ప్రత్యేకమైన నాన్-ఇన్వేసివ్ విధానాన్ని ఉపయోగిస్తోంది. దీన్నే మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (ఎంఈజీ) అని పిలుస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన హెల్మెట్‌ను రూపొందించారు. చూడటానికి ఇది పాతకాలపు హెయిర్ డ్రైయర్లా ఉంటుంది. ఈ హెల్మెట్‌ను తలకు ధరించినప్పుడు, అది మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మమైన అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది. ఈ సిగ్నల్స్‌ను ఏఐ వ్యవస్థ విశ్లేషించి, వ్యక్తి ఏం టైప్ చేయాలనుకుంటున్నాడో డీకోడ్ చేసి టెక్స్ట్‌గా మారుస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టీరియోటాక్టిక్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, ఎలక్ట్రోకార్టికోగ్రఫీ వంటి పద్ధతులకు బ్రెయిన్ సర్జరీ అవసరం. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, ప్రమాదకరమైనవి కూడా. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ వంటి సంస్థలు మెదడులో చిప్‌లను అమర్చడం ద్వారా ఇలాంటి ఫలితాలను సాధించాలని చూస్తున్నాయి. అయితే, మెటా తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ఎలాంటి సర్జరీ లేకుండా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో పనిచేస్తుండటం గమనార్హం.
కచ్చితత్వం ఎంత?
ఈ ఏఐ వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు, 9 మంది వాలంటీర్ల నుంచి సుమారు 22,000 వాక్యాల డేటాను సేకరించారు. ప్రతి వాలంటీర్ దాదాపు 10 గంటల పాటు ఎంఈజీ హెల్మెట్ ధరించి టైప్ చేశారు. ఈ కొత్త వెర్షన్, ఎండ్-టు-ఎండ్ డీప్ లెర్నింగ్ ద్వారా నేరుగా మెదడు సిగ్నల్స్‌ను విశ్లేషించి భాషను డీకోడ్ చేస్తుంది. దీని ఫలితంగా ఈ వ్యవస్థ సగటున 61 శాతం కచ్చితత్వంతో పదాలను గుర్తించగలిగింది. ఇదే రంగంలోని ఇతర నాన్-ఇన్వేసివ్ పద్ధతుల కచ్చితత్వం కేవలం 8 శాతం మాత్రమే. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఒక పార్టిసిపెంట్‌లో ఈ కచ్చితత్వం 78 శాతంగా నమోదైంది.
మెదడు సిగ్నల్స్ స్పష్టంగా లేనప్పుడు లేదా గందరగోళంగా ఉన్నప్పుడు, ఆ ఖాళీలను పూరించడానికి మెటా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను (LLMs) కూడా ఉపయోగించింది. మన ఫోన్లలోని ఆటోకరెక్ట్ ఫీచర్ లాగా, ఇది వ్యాకరణం, సందర్భాన్ని బట్టి సరైన పదాన్ని అంచనా వేస్తుంది. ఎక్కువ ట్రైనింగ్ డేటా అందుబాటులోకి వస్తే, కచ్చితత్వం మరింత మెరుగుపడుతుందని మెటా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ పరిశోధన మెటా చేపట్టిన ‘డిజిటల్ బ్రెయిన్ ప్రాజెక్ట్’లో ఒక భాగం. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ‘సాబీ’ వంటి ఇతర కంపెనీలు కూడా ఇలాంటి టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి.