ఆంధ్రప్రదేశ్‌లో సమాచార, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసి, మారుమూల గ్రామాలకు సైతం కనెక్టివిటీ అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమాచార నెట్‌వర్క్ విషయంలో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ దిశగా రాష్ట్రంలోని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై ఆయన ఉన్నతాధికారులు, వివిధ సర్వీస్ ప్రొవైడర్లతో అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మొబైల్ కవరేజి విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, భౌగోళికంగా కవరేజి లేని మారుమూల ప్రాంతాల్లోనూ సెల్ టవర్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,694 సెల్ టవర్లు ఉండగా, అదనంగా మరో 2310 టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, అవసరమైన టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సర్వీస్ ప్రొవైడర్లకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వీలైతే వంద రోజుల వ్యవధిలో ఈ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
కేవలం నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేందుకు కూడా సర్వీస్ ప్రొవైడర్లు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వాట్సప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’, సంజీవని వంటి సేవలను ప్రజలు సమర్థంగా వినియోగించుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు డిజిటల్ అక్షరాస్యులైతే, మొబైల్ ఫోన్ ద్వారానే మరిన్ని ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలరని వివరించారు. త్వరలో ఏఐ ఆగ్రానమిస్ట్, ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్ వంటి వినూత్న సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాతిపదికన అన్ని ప్రాంతాలకూ పూర్తి మొబైల్ కవరేజీ అందిస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలో ఎక్కడా తవ్వకాలు జరపకుండా, ప్రతి ఇంటికీ ఫైబర్ ద్వారానే సమాచార నెట్‌వర్క్ అందించే ప్రణాళికను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,69,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌తో పాటు 28.67 లక్షల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సమావేశంలో తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికారులు, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.