జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన పండు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ జామకాయను తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని పోషకాహార మరియు ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. విరుద్ధ ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.
ముఖ్యంగా జామకాయ తిన్న వెంటనే పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను అసలు తీసుకోకూడదు. జామకాయలో ఉండే సిట్రిక్ లక్షణాలు, విటమిన్ సి పాలతో కలవడం వల్ల కడుపునొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. పండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు లేదా దగ్గు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందువల్ల కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటుగా జామకాయ తిన్న వెంటనే అరటిపండు తినడం కూడా ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ రెండు పండ్లను ఒకేసారి లేదా వెంటవెంటనే తినడం వల్ల కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే, మజ్జిగ లేదా పెరుగును కూడా జామకాయ తిన్న వెంటనే తీసుకోకూడదు, ఇది జలుబుకు దారితీస్తుంది. ఇలాంటి చిన్నచిన్న ఆహార నియమాలను పాటించడం ద్వారా జామకాయలోని పూర్తి పోషకాలను ఎలాంటి ఉదర సంబంధిత ఇబ్బందులు లేకుండా మన శరీరం గ్రహించేలా చేసుకోవచ్చు.