అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026: తమిళనాట విజయ్ ప్రభంజనం.. బెంగాల్‌లో కమలం జోరు

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఎన్నికల ఫలితాల్లో అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం 100కు పైగా స్థానాల్లో TVK ఆధిక్యంలో కొనసాగుతూ కింగ్ మేకర్‌గా కాకుండా ఏకంగా కింగ్‌గా ఎదిగే దిశగా సాగుతోంది. అటు డిఎంకే, ఇటు ఏఐఏడిఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ పార్టీ నంబర్ వన్ స్థానంలో నిలవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ కాలం తర్వాత అధికార మార్పిడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ నేతృత్వంలో సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది. ముఖ్యంగా భవానీపూర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న బీజేపీ హవా ఆ పార్టీని అధికార పీఠం వైపు నడిపిస్తోంది.

కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో కూడా ఓట్ల లెక్కింపు అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరు తీవ్రంగా ఉండగా, అస్సాంలో బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద 2026 అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదికగా మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ కొనసాగితే తమిళనాడులో విజయ్ కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *