తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చినప్పటి నుండి సీట్ల కోసం ప్రయాణికుల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక బాలికపై కొంతమంది మహిళలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ప్రయాణికులందరూ చూస్తుండగానే సాటి మహిళలు అని కూడా చూడకుండా సదరు బాలికను అసభ్య పదజాలంతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని లాగి విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. బస్సులో ఎక్కిన సదరు బాలిక ఒక సీటులో కూర్చొని ఉండగా, అక్కడకు వచ్చిన కొందరు మహిళలు ఆమెను పక్కకు జరగాలని లేదా సీటు ఖాళీ చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో సహనం కోల్పోయిన మహిళలు, ఒంటరిగా ఉన్న ఆ బాలికపై ఒక్కసారిగా దాడికి దిగారు. తోటి ప్రయాణికులు అడ్డుకోవాలని చూసినప్పటికీ, ఆ మహిళలు ఆవేశంతో ఊగిపోతూ బాలికను భౌతికంగా వేధించారు.
ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు మహిళల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటు కోసం ఇంత క్రూరంగా ప్రవర్తించాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన మహిళలను గుర్తించే పనిలో పడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల మధ్య ఇలాంటి ఘర్షణలు పెరిగిపోతుండటం పట్ల అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.