దేశ రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి ఎన్నికల పోరులోనే సంచలన విజయాన్ని నమోదు చేశారు. బిహార్‌లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు.
బంకీపూర్‌లో బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ప్రశాంత్ కిశోర్ 20 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పీకే.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తన సత్తా చాటడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
జన్ సురాజ్ పార్టీని స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి ప్రశాంత్ కిశోర్ విస్తృతంగా పనిచేశారు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలుపొందడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో బిహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పార్టీ భవిష్యత్‌పై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.