రెండ్రోజులుగా కంటిమీద కునుకు లేకుండాపోయింది. అమ్మాయి ఎలాఉందో ఏమోననే ఆందోళనతోనే గడిపేస్తున్నాం. మా కూతురు అమెరికాలో మెడికల్ విభాగంలోనే పని చేస్తోంది. తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. రోజుకు రెండు మూడుసార్లు ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా భయం మాత్రం పోవడం లేదు’కాలిఫోర్నియాలో ఉంటున్న తమ కూతురు పట్ల నగరానికి చెందిన తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఆమెకు ఫోన్ చేసిన ప్రతిసారీ తన క్షేమం కంటే హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రుల క్షేమసమాచారం గురించే ఎక్కువగా తెలుసుకుంటోంది. జాగ్రత్తలు చెబుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తోంది. ఇది ఏదో ఒకటి రెండు కుటుంబాలకు చెందిన సమస్య కాదు. విద్య, ఉద్యోగ, వ్యాపార అవరాల కోసం విదేశాల్లోఉంటున్న లక్షలాది మంది పట్ల నగరంలోని వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన వేళ.. ఏ నోట విన్నా భయాందోళనలే వ్యక్తమవుతున్నాయి.