సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా మహిళా శాసనసభ్యుల పై అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ఆయన నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ, రేవంత్ రెడ్డి కావాలనే ఆడబిడ్డలను అవమానించారు.
తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరు మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు భట్టి గారు.
పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడినము అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం. అసెంబ్లీలో ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం’ అంటూ కేటీఆర్ అన్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.