జగన్ కంటే కేతిరెడ్డి బెటరా..? వైసీపీలో ఏం జరుగుతోంది..?

వైసీపీలో ఏం జరుగుతోంది? ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండునెలలు గడిచిపోయింది.. కీలక నేతలు ఎందుకు సైలెంట్ అయిపోయారు? జగన్ వ్యవహారశైలి వల్లే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? వచ్చే ఐదేళ్లు వైసీపీ నేతల మాటేంటి? ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాటలను ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కంటే కేతిరెడ్డి బెటరా?

 

గడిచిన ఐదేళ్లలో జగన్ పాలనను వైసీపీ నేతలు, ప్రజలు దగ్గరుండి చూశారు. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి మరకలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నట్లు అధికార పార్టీ చెబుతున్నమాట. ఒకే వర్గానికి కొమ్ముకాశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దాని ఫలితమే 151 సీట్ల నుంచి 11 పడిపోయింది ఆ పార్టీ. ప్రస్తుతం వైసీపీలో నేతల వ్యవహారశైలిని గమనించిన కొందరు ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు.

 

తాజాగా ఉమ్మడి అనంతపురంలోని ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు టీడీపీకి అనుకూలంగా చేశారన్నది కొందరు వైసీపీ నేతల మాట. అక్కడికే వచ్చేద్దాం. చంద్రబాబు పాలనపై కేతిరెడ్డి సోషల్‌మీడియా వేదికగా నోరువిప్పారు. చంద్రబాబు సర్కార్‌కు కొంత సమయం ఇవ్వాలన్నారు. సంపద సృష్టించనివ్వండి.. ఆ తరువాత ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. రెండు మూడు నెలల్లో అన్ని అద్భుతాలు జరిగిపోవాలంటే కుదరదని, అది కరెక్టు కాదన్నారు. ఈ ఏడాది చివరివరకు సమయం ఇవ్వాలన్నారు.

 

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాటలను ఎవరికివారు ఓన్ చేసుకునేపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పింది ముమ్మాటికీ నిజమేనని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఏయే శాఖల్లో ఎంత అవినీతి జరిగిందో లెక్కలు తెలియక బడ్జెట్ కూడా పెట్టలేదు. చివరకు ఓటాన్ అకౌంట్ వెళ్లాల్సిన పరిస్థితి చంద్రబాబు సర్కార్‌ది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి సర్కార్ ఖజానాలో కేవలం 100 కోట్లను ఉందని అధికార పార్టీ మాట.

 

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటలు నిజమేనని వైసీపీలోకి కొందరు నేతలు అంటున్నారు. ఈ విషయంలో వెంకట్రామిరెడ్డి ఆలోచన విధానం బాగుందని అంటున్నారు. పార్టీకి అధినేత అనేవారు ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని, ఈ విషయంలో జగన్ కంటే కేతిరెడ్డి బెటరనే సెటైర్లు పడిపో తున్నాయి. వెంకట్రామిరెడ్డి మాటలను టీడీపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ లెక్కన వైసీపీలో అంతర్గత కలహాలు మొదలైందన్నది అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంత మంది నేతలు.. ఇంకెన్ని విషయాలు బయటపెడతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *