ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పంలో ఏం జరుగుతోంది? వైసీపీ కార్యాలయాన్ని ఎందుకు మూసివేశారు? అక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు అజ్జానంలోకి వెళ్లి పోయారా? కుప్పంలో టీడీపీ క్లోజ్ అవుతుందని చెప్పిన వైసీపీ నేతలు, తొలుత ఆఫీసును ఎందుకు క్లోజ్ చేశారు? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.
ఎన్నికలకు ముందు కుప్పంలో టీడీపీ అధినేత పని అయిపోయిందని పదేపదే వ్యాఖ్యలు చేశారు వైసీపీకి చెందిన కీలక నేతలు. ఎన్నికల తర్వాత టీడీపీ దుకాణం క్లోజ్ అవుతుందని కుండబద్దలు కొట్టారు. ఫలితా ల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కుప్పం వైసీపీ ఆఫీస్ క్లోజ్ అయ్యింది. భవనానికి తాళాలు పడ్డాయి.
ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎవరు అందుబాటులో లేరని తెలుస్తోంది. కొందరు నేతలు కర్ణాటకకు, మరికొందరు తమిళనాడుకు వెళ్లినట్టు అంతర్గత సమాచారం. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భరత్ అజ్జానంలో ఉన్నాడని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన జులుం ప్రదర్శించిన భరత్, ఆయన జాడ లేదని అంటున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక కేడర్ అయోమయంలో పడి పోయింది.
పరిస్థితి గమనించిన వైసీపీకి చెందిన ఆ నియోజకవర్గానికి చెందిన పంచాయతీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సెలర్లు టీడీపీకి వచ్చేందుకు అక్కడి నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో తీర్థం పుచ్చుకోవాలన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.
తమను శత్రువులుగా చూసిన వైసీపీ నేతలను టీడీపీలో చేరడాన్ని అంగీకరించమని చెబుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉండడం కోసం చేరికలు అవసమేనని ఆయన అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కుప్పంలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమన్నమాట. టీడీపీని ఖాళీ చేస్తామని చెప్పి.. వైసీపీ దుకాణం క్లోజ్ కావడం కొసమెరుపు.