పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా మద్దతిచ్చారన్నారు. ఈ మద్దతు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగేలా నేతలు పని చేయాలంటూ వారికి సూచించారు.
‘పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూశాం. ప్రజలు మనవైపే ఉన్నారనే విషయం ఈ ఎన్నికలతో స్పష్టమైపోయింది. రానున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేతలు సమాయత్తం కావాలి. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రావొచ్చనే నమ్మకం ఉంది. అదేవిధంగా అతి నమ్మకం కూడా ఉండొద్దు. అలా ఉంటే కొంప ముంచుతుంది. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీని కోల్పోయింది. అయినా కూడా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ప్రజలను వర్గాలుగా విభజిస్తూ, శతృత్వాన్ని వ్యాప్తి చేస్తున్నది’ అంటూ సోనియా గాంధీ పేర్కొన్నారు.
బడ్జెట్‌లో రైతులు, యువతను పట్టించుకోలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన రంగాల్లో పెండింగ్ పనులకు సంబంధించిన కేటాయింపుల్లో కూడా న్యాయం చేయలేదని ఆమె విమర్శించారు. కావడి యాత్రలో విధించినటువంటి నియమాల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. అయితే, సుప్రీంకోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకున్నదని ఆమె స్పష్టం చేశారు.