రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం–: కేటీఆర్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పద్దు అంటూ ఆయన విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేశారన్నారు. బడ్జెట్ లో విషయం, విధానం లేదన్నారు. మొత్తంగా పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ఆయన మండిపడ్డారు.

 

‘రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం, దివ్యాంగులకు, అవ్వాతాతలకు, నిస్సహాయులకు మొండిచేయి చూపారు. దళితులను దగా చేస్తూ గిరిజనులను మోసం చేశారు. చివరకు శూన్యహస్తమే మిగిలింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి నేరుగా మానేరు డ్యామ్ ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. గత 8 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేయకుండా పంట పొలాలను ఎండబెట్టారంటూ ఆయన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి ప్రతిరోజూ లక్షల క్యూసెక్కుల నీరు దిగువనకు వృథాగా పోతున్నాయని, అయినా కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ మండిపడ్డారు. లోయర్ మానేరు, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులను పరిశీలించేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

 

ఎల్ ఎండీ, అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ నింపితే రైతుల్లో భరోసా ఏర్పడుతుందన్నారు. నీరు ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులను నింపకుండా వర్షం పడలేదనే సాకు చూపెడుతున్నారంటూ కేటీఆర్ పైరయ్యారు. కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే రిజర్వాయర్లు నిండుతాయన్నారు. ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు గానూ కేవలం 24 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లను నింపితే రైతుల అవసరాలతోపాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీరుతాయంటూ ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *