వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు.. కారణం ఏమిటంటే..?

వైఎస్ వివేకా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చివరి దాకా వెంటాడింది. ప్రతిపక్షాలు ఈ కేసు ఆధారం చేసుకుని వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశాయి. మొన్నటి ఏపీ ఎన్నికల్లోనూ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు ఈ కేసును ప్రధానం చేసుకుని ఎన్నికల ప్రచారంలో వైసీపీ, వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తి ఉన్న ఈ కేసుకు సంబంధించి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

 

వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి పేరును నిందితుల జాబితా నుంచి తొలగంచే నిర్ణయం జరిగింది. ఇందుకు సంబంధించి సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

 

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించిందని, కాబట్టి నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ అధికారులు ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీటులో తన పేరును సాక్షిగా చేర్చినట్టు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

 

దస్తగిరి తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. ఆయన వాదనలతో ఏకీభవించింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తున్నట్టు తెలిపింది.

 

వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఐదేళ్లు జైలు జీవితం గడిపిన దస్తగిరి అప్రూవర్‌గా మారారు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పైనే బయట ఉన్నారు. ఏకంగా కడప పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పోటీకి దిగి ఓడిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పరిణామం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *