జగన్‌పై హోంమంత్రి ఆగ్రహం..! సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో మాట్లాడుతున్నారని..!

వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా తూర్పారబట్టారామె. సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సామెతను హోంమంత్రి గుర్తు చేశారు.

 

శాంతి భద్రతల వ్యవహారంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అనిత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని గుర్తు చేశారు. అందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారన్నారు.

 

సోషల్‌మీడియా వేదికగా వైసీపీ నేతలు.. టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా దాడులు సైతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అసత్యాలు చెబుతున్నారని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఆ జాబితా ఇచ్చే దమ్ము జగన్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు.

 

హత్యకు గురైనవారి పేర్లు నేషనల్ మీడియాతో అడిగితే జగన్ చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారామె. అసెంబ్లీకి వచ్చి హత్యకు గురైనవారి జాబితా ఇచ్చే దమ్ము జగన్‍కు ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే జగన్ ఆలోచనగా చెప్పుకొచ్చారు. హత్యలకు సంబంధించిన వివరాలు ఇస్తే, తగిన విచారణ చేయిస్తామన్నారు. తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

వైసీపీ పాలనలో గంజాయి రాష్ట్రమంతటా విస్తరించిందన్నారు హోంమంత్రి అనిత. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి లభించేలా వ్యాపారం జరిగిందన్నారు. గంజాయి తాగి విచక్షణ లేకుండా, నేరాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గంజాయి నియంత్రణ అనేది మా ప్రభుత్వ మొదటి బాధ్యత వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *