‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం.!

బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీ మహిళా ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడియు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలైన ఆర్ జెడి, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో నినాదాలు చేశారు.

 

ప్రతిపక్షాల హోరుతో అసెంబ్లీ అట్టుడికి పోయింది. దీంతో ముఖ్యమంత్రి లేచి ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఆర్ జెడి పార్టీకి చెందిన రేఖా దేవి అనే ఎమ్మెల్యే.. నితీష్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సిఎం నితీష్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. రేఖా దేవిపై అనుచిత వ్యాఖ్యాలు చేశారు. ”నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు నీకే చెబుతున్నా,” అంటూ విరుచుకు పడ్డారు.

 

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు, మీడియా నితీష్ కుమార్ ను తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా అర్ జెడి నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి తీరుపై స్పందిస్తూ.. మహిళలను అవమానించే విధంగా మాట్లాడడం సిఎం నితీష్ కుమార్ కు అలవాటుగా మరిందని అన్నారు.

 

నితీష్ కుమార్ పార్టీ జెడియు గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత విద్యా కోర్సుల్లో రిజర్వేషన్ విధానం అమలు చేస్తామని చెబుతూ వచ్చింది. కానీ. బిహార్ లో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్న విద్య కోర్సుల్లో స్థానికుల కోసం 65 శాతం చేస్తూ.. రిజర్వేషన్ తీసుకువచ్చిన చట్టాన్నిజూన్ నెలలో పట్నా హై కోర్టు రద్దు చేసింది. దీనికి తోడు ఇటీవల కేంద్ర మంత్రి జయంత్ చౌధరి పార్లమెంటులో మాట్లాడుతూ.. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని.. అలా చేయడం నిబంధనలకు వ్యతిరేకమని స్ఫష్టం చేశారు.

 

ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ ప్రభుత్వం చెప్పినవేవీ జరగలేదని.. ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ నినాదాలు చేస్తున్న మహిళా ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఇంతకు ముందు కూడా నవంబర్ 2023లో మాట్లాడుతూ.. మహిళలకు విద్య చాలా అవసరమని.. అప్పుడే వారు భర్తలతో ఎక్కువ శృంగారం చేయకుండా గర్భం దాల్చరని.. వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజేపీ ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేపింది. చివరికి నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *