తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి కామెంట్..

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు వరాలు ప్రకటించింది. బిహార్ రాష్ట్రానికి రూ. 26 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తామని తెలిపింది. కానీ, బడ్జెట్ పూర్తి ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక్క సారి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తావించలేదు. పునర్విభజన చట్టాన్ని పలుమార్లు ప్రస్తావించి ఏపీకి నిధులు ప్రకటించిన నిర్మలమ్మ.. తెలంగాణను మాత్రం విస్మరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ. 5,336 కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో రూ. 32,946 విలువైన ప్రాజెక్టులు, 40 అమృత్ భారత్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో పూర్తిగా వంద శాతం ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు ఉన్న రాష్ట్రమని వివరించారు. రికార్డ్ స్థాయిలో 437 అండర్ పాస్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. ఇక ఏపీకి గురించి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 9,151 కోట్లు రైల్వే కోసం కేటాయించారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ హయాంతో పోల్చితే 10 రెట్లు ఎక్కువ కేటాయింపులు తాము జరిపామని చెప్పారు. రూ .73,743 కోట్లు విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. 73 స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్‌లో ఉన్నాయని, 743 అడర్ పాస్/ఫ్లై ఓవర్ల నిర్మాణం జరిగాయని తెలిపారు.

 

సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఇచ్చిన భూమిలో నీరు నిలిచిపోతున్నదని, వేరే భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేరే స్థలం చూసి కేటాయిస్తామన్నారని తెలిపారు. అమరావతి లైన్ ప్రాజెక్టు చాలా కీలకమైందని పేర్కొన్నారు. అమరావతి లైన్ ప్రాజెక్టులో చాలా కీలకమైందని వివరించారు. నది మీద బ్రిడ్జితో కలుపుకుని రూ. 247 కోట్లతో 56 కిలోమీటర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడారు. విజయవాడ రైల్వే జంక్షన్ చాలా కీలకమైందని, మాస్టర్ ప్లాన్ రెడీగా ఉన్నదని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *