దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఎక్సయిజ్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన.. వైసీపీ నేతలు 3వేల 113 కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా లోకల్ బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు.

 

2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ తీసుకొచ్చిన మద్య విధానంలో అనేక అవకతవకలు జరిగాయని.. వాటిపై సీఐడీతో విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మద్యం అమ్మకాల్లో మొత్తం నగదు లావాదేవీలు చేశారని.. అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. లిక్కర్ ఒక్క కేస్‌కు 200 రూపాయల చొప్పున, బీర్‌ కేస్‌కు 50 రూపాయల చొప్పున వసూలు చేశారని.. పెద్ద బ్రాండ్లను వెళ్లగొట్టి లోకల్ బ్రాండ్‌లతో లాలూచీ పడ్డారని చంద్రబాబు విమర్శించారు.

 

సీఐడీ విచారణలో ఎంత అవినీతి జరిగిందో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో రైల్వేలో ఉన్న వాసుదేవరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా వాసుదేవ రెడ్డి పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. 20 రోజుల నుంచి వాసుదేవ రెడ్డి కార్యాలయం, నివాసాల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఐదుగురు వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు సీఐడీ తేల్చింది. వారిపై కేసు నమోదు చేసి విచారించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *