ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

గత వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. సాధారణ ప్రజలు మొదలు మేధావుల వరకు ఈ అంశంపై అనేక కోణాల్లో వాదన ప్రతివాదనలు చేశారు. చివరకు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. మన రాష్ట్ర పిల్లలు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని, ఆ స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నత శిఖరాలో అధిరోహించాలని వైసీపీ ప్రభుత్వం తరుచూ చెప్పింది. అయితే, తెలుగు భాష గొప్పదనం మసకబారుతుందని, పిల్లలకు మాతృభాషలో బోధిస్తేనే సులువుగా అర్థమవుతుందనే వాదనలను అప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తాయి. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చర్చ వచ్చింది.

 

రాష్ట్ర శాసన మండలిలో కొశ్చన్ అవర్‌లో ఓ ప్రశ్న వచ్చింది. పాఠశాలల్లో మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ అవసరమా? అనే ప్రశ్న రాగా.. అందుకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియానికి ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా ఇంగ్లీష్ మీడియం విద్య అమలు సరిగ్గా సాగదని వివరించారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టోఫెల్ శిక్షణ, పరీక్షల వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతున్నదని, అలాగే.. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇంగ్లీష్ భాష అవసరమే కానీ.. అమలులో లోపం వల్ల ఇటు తెలుగు, అటు ఇంగ్లీష్ రెండింటిపైనా అవగాహన లేకుండా పోతే మాత్రం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు తనలా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడటం మంచిది కాదన్నారు.

 

గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం వల్ల పెద్దగా ప్రయోజనాలేమీ లేవని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 72 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపారు. అయితే, గవర్నమెంట్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ ఎందుకు రావడం లేదో సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు.

 

భాషకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఆమోద సమయంలో పూర్తిగా తెలుగు భాషను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొత్త ప్రయత్నం చేశారు. ఈ సమయాల్లో ఆయన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు. వైసీపీ, జనసేనల నుంచి అందిన వర్తమానాలను ఆయన పూర్తిగా తెలుగులోనే చదివారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *