ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక అమరావతికి మహర్ధశ

ఏపీకి మంచి రోజులు రానున్నాయి. ఏ కూటమిని చూసి గంపగుత్తగా ఓట్లేశారో ఇప్పుడు అదే కూటమి ఏపీ ప్రజలకు అండగా నిలబడుతున్నామని సంకేతం ఇస్తోంది. జగన్ పాలనలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఆటంకం కావడంతో అటు రాజధాని, ఇటు పోలవరం రెండూ పూర్తిచేయలేక ప్రజాగ్రహానికి గురయ్యారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా జతకట్టాయి. ముఖ్యంగా ఈ కూటమిని ప్రజలు గెలిపించడానికి కారణం ఏపీకి మేలు జరుగుతుందనే ఆశతోనే. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని జోడించి కేంద్రం నుంచి నిధులు రాబడతారని పూర్తి విశ్వాసంతో ఓట్లేశారు. ఇప్పుడదే నిజమవుతోంది.

 

ఏపీకి నిధుల వాన

 

2024-25 కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల వర్షం కురిసింది. కేంద్రం వరాల జల్లును కురిపించింది. అంతా ఊహించినట్లుగానే మంగళవారం కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధానికి నిధులు సమకూరేలా ప్రకటన చేశారు. ముందుగా అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జార్ఖండ్, బీహార్ రాష్ట్రలతో పాటు ఏపీకి సైతం కేంద్రం ప్రత్యేక నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు నిధులు లేక దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా వెనకబడిన జిల్లాలైన ప్రకాశం, రాయలసీమ కు స్పెషల్ ఎకానమీ ప్యాక్ ను కేంద్రం అందిస్తుందని తెలిపారు. ముందు ముందు అవసరాన్నిబట్టి మరిన్ని నిధులు కేంద్రం ఏపీకి అందజేస్తామని తెలిపారు.

 

సర్వత్రా హర్షం

 

నిర్మలమ్మ ప్రకటనతో ఏపీవాసులు పండగ చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వచ్చిన తొలి బడ్జెట్ లో ఏపీకి కేంద్ర సాయం అందేలా చేశారని సోషల్ మీడియాలో బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి బడ్జెట్ లోనూ ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. అయితే ఈ సారి పరిస్థితి కొంత మెరుగుపడింది. కూటమిని ఎన్నుకుని మంచి పని చేశామని ఆంధ్రా ఓటర్లు ఆనందిస్తున్నారు. నిర్మలా సీతారామన్ కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అమరావతి అభివృద్ధికి ఇది ఆరంభమేనని ముందు ముందు మరింత అభివృద్ధి ఉండబోతోందని కేంద్ర బడ్జెట్ సూచన ప్రాయంగా చెప్పినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *