హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్..

ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో ఆయన స్పీకర్ లేఖ రాశారు. అయితే, ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను కేవలం వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా కూడా ఇవ్వలేదంటూ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.

 

కాగా, ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనంటూ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో 10 శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదంటూ జగన్ ఇంతుకుముందు స్పీకర్ కు లేఖ రాశారు. మామూలుగా అయితే 10 శాతం సీట్లు వస్తే వారిని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు 10 శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ స్పీకర్ గుర్తిస్తారు. కానీ, ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం 18 సీట్లు వచ్చి ఉంటే ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *