‘అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన.. డిసెంబర్ 9లోగా నియమకాలు’..

త్వరలో ప్రారంభంకాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తామని.. నియామకాలు డిసెంబరు 9లోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రజాభవన్‌లో శనివారం రాత్రి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ అనే కార్యక్రమాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023లో రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన 35 మందిని, అలాగే ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన ఆరుగురిని రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం, ఇతర మంత్రలు సన్మానించారు.

 

ఈ ఏడాది (2024) సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారికి సింగరేణి సంస్థ తరపున రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, సింగరేణి సీఎండీ బలరాం, సీఎస్‌ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. గత పదేళ్ల కాలంలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నిరుద్యోగుల సమస్యలు గుర్తించి గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేశాం. పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణి సంస్థకు నా అభినందనలు. సివిల్స్‌ పరీక్షల్లో తెలంగాణ జెండా ఎగరేసి జాతీయ స్థాయిలో రాష్ట్ర సత్తా చాటాలి. మెయిన్స్‌ కోచింగ్‌ కోసం ప్రిలిమ్స్‌ విజేతలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌, మెరుగైన శిక్షణ, హాస్టల్‌ ఖర్చుల కోసం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. పరీక్షల్లో ఉతీర్ణులైన వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ నుంచి మరింతమంది సివిల్స్‌కు ప్రయత్నించాలి’’ అని వ్యాఖ్యానించారు.

 

 

సింగరేణిని అభినందించిన ఉపముఖ్యమంత్రి

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ”సివిల్స్‌ పోటీపరీక్షలు రాయడం అభ్యర్థులకు వ్యయప్రయాసలతో కూడిన అంశం. పరీక్ష కోసం శిక్షణ తీసుకునే అభ్యర్థుల ఇబ్బందులు తీర్చడానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలైంది. సింగరేణి సంస్థ తరపున దీన్ని చేపట్టడం అభినందించదగ్గ విషయం,” అని అన్నారు.

 

సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ.. ”నేను సివిల్స్‌ పరీక్ష పాసై ఉద్యోగంలో చేరిన తరువాత ముఖ్యమంత్రిని కలవడానికి రెండేళ్లు పట్టింది. ఈ రోజు సివిల్స్‌ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి అభినందించేందుకు.. ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా రావడం చాలా గొప్ప విషయం,” అని ప్రశంసించారు.

 

అంతకుముందు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.బలరాం మాట్లాడుతూ.. సివిల్స్‌ పరీక్షల కోసం తాను ప్రిపేరయ్యే సమయంలో కోచింగ్‌ కోసం రూ.2 వేలు లభించక చాలా ఇబ్బందులు పడ్డానని, ఒక పుస్తకం కొనేందుకు రూ.50 కావాల్సి వస్తే.. వారం రోజులపాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుకుచేసుకున్నారు. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థులకు ఎదురు కాకూడదని.. సివిల్స్‌లో రాష్ట్రం నుంచి వీలైనంత ఎక్కువ మంది విజయం సాధించేలా ప్రోత్సహించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ భాగస్వామిగా ఉండటం సంతోషకరమైన విషయమన్నారు. తెలంగాణ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించే 300 మందిలో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల కు రూ.లక్ష ఆర్థిక సాయం సింగరేణి సంస్థ అందిస్తుందని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకటస్వామి, కోరెం కనకయ్య, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, ప్రేంసాగర్‌రావు, ఆర్థికశాఖ స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్, కనీస వేతనాల కమిషన్‌ ఛైర్మన్‌ జనక్‌ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *