కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని అన్నారు. గత ఐదేండ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. టీడీపీ ఎంపీల సమావేశం అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందని ఆయన వివరించారు.
ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతామంటూ ఆయన వివరణ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాబోదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను గత జగన్ సర్కారు దారి మళ్లించిందని, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలేదన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర వాటా ఇవ్వని కారణంగానే కేంద్ర పథకాలు ఆగాయంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జగన్ పాలనలో అవకతవకలు జరిగినట్లు కేంద్రం కూడా వెల్లడించిందని ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో 3 శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారని ఆయన చెప్పారు.
కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తమపై ఉందంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సీఎం చంద్రబాబుతో శనివారం టీడీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో బడ్జెట్ అంశంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు ఆయన చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చిన్ని పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ వేదికగా జగన్ దుష్ర్పచారాన్ని తిప్పికొడుతామన్నారు.