జగన్ లెటర్‌కు పురందేశ్వరి కౌంటర్..!

ఏదైనా సమస్యను తనకు అనుకూలంగా మలచుకోవడంతో వైసీపీకి తిరుగులేదని చెబుతారు రాజకీయ నేతలు. సమస్య అనుకూలమైనా, వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఓన్ చేసుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడూ అంతే.. లేనప్పుడూ అదే తీరు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 40 రోజులు కావస్తోంది. అల్లర్లు, దాడులతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నట్లు భావించి మాజీ సీఎం జగన్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రియాక్ట్ అయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం క్రమంగా పెరుగుతోంది. ఏపీ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీకి మాజీ సీఎం జగన్ లెటర్ రాయడాన్ని తప్పుపట్టారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ విషయంలో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో జరిగిన దారుణాలపై మాటేంటని ప్రశ్నించారామె. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో వైసీపీ గూండాల నుంచి తన సోదరిని కాపాడేందుకు 14 ఏళ్ల బాలుడు సజీవ దహనమైన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు.

 

ఇంతకీ ఆ లేఖలో జగన్ ఏమని ప్రస్తావించారు. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయంటూ జగన్ లేఖ రాశారు. రెడ్ బుక్ ఆధారంగా ఏపీలో పాలన సాగుతోందని ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలన్నది అందులో సారాంశం. ఇవేకాకుండా చాలా విషయాలు ప్రస్తావించారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.

 

జగన్ బెంగుళూరు ప్లాన్‌‌ని అమలు చేసేందుకు ఇదో ఎత్తుగడగా వర్ణిస్తున్నారు ఏపీ కమలనాధులు. అధి కారం పోయాక వైసీపీ అధినేత జగన్ రెండుసార్లు బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. కాకపోతే కర్ణాటక బీజేపీ నేతలతో పలుమార్లు ఆయన భేటీ అయ్యారట.

 

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావాలంటే రాష్ట్ర సమస్యలపై లేఖలు రాయాలని, ఇప్పుడు కాకపోయినా కొద్దిరోజులకైనా ఆయన అపాయింట్మెంట్ లభిస్తుందని సూచన చేశారట. దాని ప్రకారమే బెంగుళూరు నుంచి రాగానే లెటర్ రాశారన్నది ఏపీ బీజేపీ నేతల మాట. మొత్తానికి జగన్ వేసే అడుగు, మాట్లాడే మాట వెనుక చాలా అర్థముంటుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *