వాటి మీద కూడా శ్వేతపత్రం ఇవ్వాలి: ఎంపీ విజయసాయి రెడ్డి..

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత నెల రోజల్లో జరిగిన రావణ కాష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని, జిల్లాల వారీగా జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, దొమ్మీల మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశ్వత్థామ హత కుంజర అనే విధానాన్ని కూటమి ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. ఇలాగే కొనసాగితే టీడీపీ మనుగడకే ప్రమాదం అని హెచ్చరించారు. లేదంటే టీడీపీ ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగానే చరిత్ర పుటల్లో నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఈ ట్వీట్‌ను ఆయన నారా లోకేశ్‌కు ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.

 

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు సంధించిన తర్వాత విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేవాదాయ శాఖలో ఉద్యోగిణి శాంతితో అక్రమ సంబంధాన్ని అంటగడుతూ వచ్చిన వార్తల నేపథ్యంలో విజయసాయి రెడ్డి టీడీపీపై విమర్శలు సంధిస్తున్నారు. ఏకంగా ఒక మీడియా సంస్థనే నెలకొల్పుతారని చెప్పారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే మీడియాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

ఈ రోజు వైఎస్ జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. పల్నాడులో నడిరోడ్డుపై హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు సంధించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని విమర్శించారు.

 

300 హత్యా ప్రయత్నాలు జరిగాయని జగన్ వివరించారు. 560 ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని, 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని విమర్శించారు. అందుకే ఢిల్లీలో ఈ నెల 24న ధర్నా చేస్తామని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు కోరామని, వారితో రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై చర్చిస్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *